మొన్నటి దసరా పండగ విశేషాలే మీతో పంచుకుందామని ఈ టపా.
అక్టోబరు 22 మధ్యాన్నానికి దసరా దశమి వచ్చేసింది.
దాంతో పాటే ప్రధాని మోదీ విచ్చేశారు. సరాసరి ఉద్దండరాయునిపాలెం చేరుకున్నారు.
విజయదశమి పర్వదినం, అన్ని పనులకీ అనువైన పెట్టని ముహూర్తం, విజయముహూర్తం అని సంప్రదాయం.
కట్టనున్నది ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని, అమరావతి! సూత్రధారి తెలుగుదేశం అధినేత – శంకుస్థాపన చసేది
దేశ ప్రధాని, ఆత్మీయ అథిది దాయాది చంద్రన్న, అతిరధ మహారధులు అనుకున్న వారందరికీ ఆహ్వానాలు – ఇదీ నేపథ్యం.

ఈనాడు దినపత్రిక జెండా శీర్షిక ప్రకారం శంకుస్థాపన సుమూహుర్తం మధ్యాహ్నం 12:36 నుండి 12:43 మధ్యన. ముహూర్త
నిర్ణయం చేసిన జ్యోతిష్కులు, విషయం ప్రాముఖ్యతను బట్టి, వారికున్న పరిధిలో లోతుగా పరిశీలించే ఉంటారు. అవకాశం ఉన్నంతలో
ఉత్తమోత్తమం అయిన సమయం ఎంపిక చేసే కృషి చేసి ఉంటారు. ఆ పైన ఏలినవారి ఊహలు, ఉద్దేశాలు, బేరీజులు,
వ్యూహాలు ఉండనే ఉంటాయి.

ఇంతకీ పునాది రాయి పడ్డ 12:43 కి, ఉద్దండరాయునిపాలెం అక్షాంశ రేఖాంశ లకు లెక్క కట్టిన రాసి చక్రం ఎలా ఉంది?
ఎందుకంటే ఈ ముహూర్త చక్రమే అమరావతీ నగర జన్మ జాతకం. జ్యోతిశ్శాస్త్రం లో ఇలా చారిత్రక నగర స్థాపన జాతకాలు
అనేక సమయాల్లో చూడడం జరుగుతుంది.

ఉదాహరణకి, బాగ్దాద్ నగర సంస్థాపన (జులై 31, 762 మధ్యాహ్నం 2:40 స్థానిక సమయం అని) చరిత్ర ప్రసిద్ధమైనది.
అబ్బాసిద్ వంశ ఇస్లామ్ సామ్రాజ్య ఖలీఫా అబూ జఫర్ అల్ మన్సూర్ ఫర్మానా ప్రకారం జరిగింది.
నౌబక్త్ , మాషా అల్లా ( Naubhakt and Masha’allah) అనే ఉద్దండ జ్యోతిష్కులు బాగ్దాద్ శంకుస్థాపన ముహూర్త నిర్ణయం చేసారు.
ఇది అల్ బిరూని రచనలను బట్టి తేటతెల్లమయిన చరిత్ర. వీరు నిర్ణయించిన ముహూర్త బలంతో బాగ్దాద్ సుమారు మూడు
వందల ఏళ్ళు ( ఫిబ్రవరి 10, 1058 వరకు) మధ్యయుగాల సంస్కృతికి కేంద్ర బిందువఇయింది.
శత్రువు కన్నెత్తి చూడ్డానికి వీల్లేకుండా బాగ్దాద్ మహోజ్జ్వలంగా మనగలిగింది అని ప్రతీతి.

సరే ప్రస్తుతానికి, మన అమరావతికి వద్దాం. దసరా దశమి నాడు, శ్రవణం నక్షత్రం. పర్వదినం, విజయ ముహూర్తం. అందుచేత
చంద్రుని తో కూడిన మకర లగ్నాన్ని, శూల యోగాన్ని, తైతుల కరణాన్ని, ఆఖరికి పంచకాన్నీ కూడా పరిశీలించ కుండా
పక్కన పెడదాం.

కాని లక్షల మందికి నివాస యోగ్యం అయిన ’మాఊరు’ అవ్వాలి. రాజధాని ఠీవి సంతరించుకోవాలి.
దాయాదులతో తలపడి దగా పడిన ఐదు కోట్ల ఆంధ్రుల్లో తిరిగి ఉత్సాహం నింపాలి.
ఉద్యమ స్ఫూర్తిని ఇచ్చి, ఊరు నిర్మాణమయ్యి, ఊడలు తన్ని నీడనివ్వాలి. తామరతంపరగా పెనవేసుకోవాలి.
“ఇంతింతై వటుడింతై నభోవీధిపైనంతై” అన్నట్టు గా పెరిగే లక్షణం ఈ పునాది రాయి పడ్డ క్షణానికి ఉందా?
నా బుద్ధినకైతే “అన్నీ మంచి శకునములే” అని ఎంతమాత్రం అనిపించడం లేదు.
ఎవరయినా పెద్దలు, ప్రాజ్ఞులు దయతో ఉటంకిస్తే ఊరట కల్గించిన వారవుతారు.

జాతక చక్రం చిత్తగించండి:

amaravatisankusthapana1

రేఖా మాత్రంగా జ్యోతిశ్శాస్త్ర పరిభాష లో కారణాలు చూద్దాం
⦁ చంద్రుని తో కూడిన చర లగ్నం, మకరం
⦁ లగ్న, చంద్ర కేంద్రములలో నీచ రవి తప్ప గ్రహాలు లేవు
⦁ ముఖ్యమైన ఇబ్బంది అష్టమంతోనే
⦁ ఈ అష్టమంలో శుక్రుడు, గురుడు, కుజుడు ఉన్నారు. ఎనిమిదవ ఇంటిని రంధ్ర స్థానం అంటారు.
⦁ ఎనిమిదవ ఇంట్లో ఉన్న గ్రహాలు శుభ ఫలం ఇవ్వడానికి శక్తి హీనులని శాస్త్ర వాక్యం.
⦁ మకర లగ్నానికి శుభయోగ కారకుడు శుక్రుడు, నైసర్గిక శుభుడు గురుడు, కుజునితో కలసి అష్టమం పాలయ్యారు.
⦁ ఈ మూడు గ్రహాలు ఉన్న సింహరాశి అధిపతి, గ్రహ రాజు అయిన రవి, కర్మస్థానమయిన పదవ ఇంట నీచ పడ్డాడు.
⦁ ఇది చాలదన్నట్టు, పంచమ దశమాధిపతి శుక్రుడు, అష్టమాధి పతి రవి తో పరివర్తన, దైన్య యోగం?

ఇలా తవ్వుకుంటూ పోతే, కడ లేదేమో అనిపిస్తోంది. పునాది రాయి పడిందో లేదోగాని రాష్ట్రం గుండెల్లో

రాయి పడింది. పెద్దని చేసి తీసుకొని వస్తే ప్రధాని మోదీ పిడతడు పార్లమెంటు మట్టి పురిశడు యమున నీళ్ళు
చేతులో పెట్టి, చేతులు దులుపుకున్నారు. నాడు, గత ప్రభుత పార్లమెంటు తలుపులేసేసి కెమేరాలాపేసి,
అయిందనిపించిన చట్టం ఎపి రీఆర్గనైజేషన్ ఏక్టు. నాడు నత్తినోరు కొట్టుకున్నారు వెంకయ్యనాయుడు.
నేడు “తాంబూలాలిచ్చేసాం, తన్నుకు చావండి” అన్న రీతిలో చేసిన ఆ ఎపి రీఆర్గనైజేషన్ ఏక్టును తు.చ.
తప్పకుండా అమలు చేస్తానని వెంకయ్య నాయుడు సాక్షి గానొక్కి వక్కాణించేసి దయచేశారు, మోదీ.

ఈ గ్రహస్థితిని అనుసరించి ఫలితాలు ఎలా ఉండవచ్చు అని ఆలోచిస్తే, అస్తవ్యస్తంగాను అడ్డంకులతోను
కూడి అసలుకే ఎసరు అన్న రీతిగా ఉంటాయనిపిస్తోంది. నేనేదో మాయాబజార్ సినిమాలో శంఖుతీర్ధుల ఫక్కీలో
పోజిచ్చే ప్రయత్నం చేస్తున్నాననుకున్నా సరే, ఈ ఎనిమిదవ ఇంట గురుడు న్యాయస్థానాల ద్వారా మూడు
చెరువుల నీళ్ళు తాగించే సత్తా ఉన్నవాడు. ఏలిన వారు, వారి నూటైదుగురు పసుపు తమ్ముళ్ళు వంత పాడినట్టుగా
పర్యావరణ అనుమతులు ’ఆటోమేటిక్’ గా వచ్చేయడం గగన కుసుమం.

విషయ పరిఙ్ఞానం ఉండి, విషయ లోలత్వం లేని public intellectuals , ఇఎఎస్ శర్మ, దేవసహాయం తదితరులు
న్యాయం చెప్పమని అర్జీలు పెడుతున్నారు – న్యాయస్థానాల్లో.

సరే ఇంతకీ పబ్బం గడిచింది. ప్రధాని వచ్చారు వెళ్ళారు. ఆయన్ని మాత్రం ఆడిపోసుకోడం ఎందుకు?
శుద్ధ దండగ. ఈ ప్రబుద్ధుల బుద్ధికి నిలువెత్తు తార్కాణం ఆఖరి ఘట్టం. ఆంధ్ర జాడ్యానికే తలమానికం.
నన్నయ, నాచన సోమన్న నుండి నిన్న మొన్న, ఈ దసరా నాడు అక్షరాభ్యాసం చేసుకుని
తెలుగులో ఓం నమః రాసిన ప్రతీ బిడ్డకీ – శాతవాహనుల నుండీ ఇవ్వాళ బొడ్డూడని పసికందు వరకూ-
అందరికీ సిగ్గు చిచ్చయ్యేలా వెలిసింది శిలాఫలకం ఇంగ్లీషులో

A M A R A V A T I
“PEOPLE’S CAPITAL”

***స్వస్తి***
మణిశర్మ, jatakalakaburlu.com, 9849 44 44 56