శాస్త్రవిషయం

జ్యోతిశ్శాస్త్రం మహాసముద్రం. మనిషి ప్రయత్నం – విధిలిఖితం, ఇవి తెగని ప్రశ్నలు తార్కిక వాదోపవాదాల పెనుగాలులు. లోతు అందని మానవ నైజం ఒక ప్రక్క, సంక్లిష్టమైన ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక, మత, చారిత్రకాది ఆటు పోట్లు, పొరలు, పోకడలు ఇంకొక వైపు. అన్నిటికీ మూలం కాలం. అదీ ఒక తీరుండదు. మనిషి ఆకళింపు చేసుకోగలిగిన కాలం “ప్రత్యక్షమపి గోపితం”; ఈ క్షణం తేటతెల్లం, మరుక్షణం మాయాజాలం! ఆదమరిస్తే దొర్లిపోతుంది, వద్దనుకుంటే నత్తనడక నడుస్తుంది. అందుకుందా మనుకుంటే పరిగెడుతుంది. ఇటువంటి ’కాలం’ గణన, స్వరూప స్వభావాల నిర్ణయం, తద్వారా భవిష్యత్తుని అంచనా వేయడం, స్థూలంగా ఇది జ్యోతిష్యం ప్రయోజనం. సాక్షాత్తూ శివుడు పార్వతికి చెప్పి, పరాశరుడి ద్వారా లోకంలోకి వచ్చిందా, “as above, so below” అని సిధ్ధాంతీకరించిన యవనులే మనకిచ్చారా లేక మన నుండే నేర్చుకున్నారా అనేవి ఖచ్చితంగా తేలే విషయాలు కావు. తేలేదల్లా కనీసం కొన్ని వేల ఏళ్ళ చరిత్ర ఉందీ విషయానికి అని.

జ్యోతిష్కులు విశ్వంలో గ్రహగతుల్ని ప్రతీకలుగా ఆసరా చేసుకొని మనుష్యులకి, దేశాలకీ వాటిని అనుసంధానం చేసి, యోగాలు అవయోగాలని నిర్ణయించి భవిష్యత్తుని అంచనా వేసే ప్రయత్నం చేస్తుంటారు.  శ్శాస్త్రం అనగానే మనం గుర్తుంచుకోవలసిన విషయం దాని పరిధి.  నాదృష్టిలో గ్రహగతుల్తో అనుసంధానించి గతాన్ని, ప్రస్తుతాన్ని అర్ధం చేసుకునేందుకు, భవిష్యత్తుని రేఖామాత్రంగానైనా అంచనా వేసేందుకు పనికి వచ్చే ఒక సాధనం జ్యోతిష్యం.

ప్రపంచంలో బాగా పురాతనమైన చైనా, గ్రీకు, రోమన్, ఈజిప్టు, మెసపొటేమియా నాగరికతల్లోనూ జ్యోతిశ్శాస్త్రం ఉంది, వృద్ధిచెందింది.  ఇక భారతీయ జ్యోతిష్యం విలక్షణతగా నాకు తోచిన విషయం: దీని సమగ్రత. ఒక పక్క వేదాంతాది దర్శనాదుల సాయంతో ఏర్ఫాటు చేసుకున్న గట్టి తాత్విక పునాది, రెండవ పక్క సామాన్య జన జీవితంతో ఇది పెనవేసుకున్న తీరు.  దీని ద్వారా ఏర్పడిన అతుకులేని అవిచ్ఛిన్న పరంపర, సాప్రదాయం.

అస్సలు ఇదంతా బూటకం, జ్యోతిష్యం ఒక మూఢనమ్మకం అనే వాదన కూడా ఉంది. అది ఈనాటిదే కాదు, జ్యోతిశ్శాస్త్రమంత పురాతనమైనది. ఇంకొన్ని ధోరణులూ ఉన్నాయి: జరీ కండువాలూ, కుంకం బొట్లూ, వీభూతులు, స్వర్ణకంకణాలు, వేళ్ళకు మించిన ఉంగరాలు. కాకం కేకా, భేకం బాకా. రంగురాళ్ళు, బొందితో కైలాసం. వీరికి ఏకాలంలోను ఏదేశంలోను కొరతే లేదు. ఇంతకు మించి అప్రస్తుతం.

నేను ప్రధానంగా భారతీయ జ్యోతిష విధానాల్ని అనుసరిస్తాను. కాని  పనికొస్తాయన్నప్పుడు, శాస్త్రానికి పరిపుష్టినిస్తాయి అన్నప్పుడు, పాశ్చాత్య పద్ధతుల్ని అదనంగా ఆనందంగా వాడుతాను.  ముఖ్యంగా గత పదిహేను ఇరవై ఏళ్ళుగా గ్రీకు లాటిన్ భాషల్లోని జ్యోతిశ్శాస్త్ర గ్రంధాలు ఇంగ్లీషు అనువాదాల్తో వస్తున్నాయి.  ఏడునుండి పదకొండవ శతాబ్దపు మధ్యకాలంనాటి అరబ్బీ గ్రంధాలు వెలుగులోకొచ్చాయి. ఇంగ్లీషు అంతర్జాలం లెక్కకు మించిన వాసి ఉన్న మూలగ్రంధాలు, వ్యాఖ్యానాలు, వ్యాసాలు నాబోటి వారి స్వల్ప శ్రమకి ఘనఫలితాల్ని కూర్చాయి.

ఇలా నేను అందుకొని, అవగాహన చేసుకొని, గుణదోష విచారణ చేసి, నిజ జీవితానుభవంతో బేరీజు వేసుకొని పనికొస్తాయన్న కొన్ని శ్శాస్త్ర విషయాలను జోడించి, దేశ విదేశాల్లో కొన్ని సంఘటనలు, వ్యక్తులపై జ్యోతిష దృక్పథంతో కామెంటరీగా టపాలు రాసి ఈ బ్లాగు ద్వారా సవినయంగా మీముందంచడం నా ఉద్దేశం. వన్నె వాసి ఉంటే ఆనందించండి. తెగడవలసి వస్తే తెలియజెయ్యండి. స్వస్తి!