ఈ జాతకాల కబుర్లు.కామ్ బ్లాగు గురించి

జ్యోతిష్యం ఈ రాతల దృక్కోణం. జనజీవనం ముడి సరుకు.  ప్రస్తుత కాలంలో దేశ విదేశాలలో వార్తలలో వ్యక్తులు, సంఘటనల గురించి జ్యోతిశ్శాస్త్ర దృష్టితో,నా బుద్ధికి తోచినంత మేరకు నా ఆలోచనల్ని తెలుగు ప్రజల ముందుంచడానికి ఈ ప్రయత్నం.  ఆర్ధికవ్యవస్థ, రాజకీయం, సంగీతం సాహిత్యం, చరిత్ర,, ప్రస్తుతం ఇలా అన్నిటినీ  “కాదేదీ కవితకనర్హం” స్టయిల్లో స్పృశిద్దామని ఉద్దేశం.

ఇకపోతే ఈ బ్లాగు తెలుగులో ఎందుకంటారా? లోకంలో ప్రతీ భాషా, ప్రతీ మాండలీకం ఒక ప్రపంచం, ఒక సంస్కృతి, ఒక సబ్ కల్చర్. ప్రతీ వారికీ తమ మాతృ భాషే తియ్యనిది, తృప్తి ఇచ్చేది. నా నాలుక ఎరిగిన కమ్మదనం ఇది. అయినా అరిశకీ ఆవకాయకి లేని ప్రశ్న ఇదేంటి? ఇంకా లోతుల్లోకి తవ్వుకుంటే, ఐదొందల సంవత్సరాల కిందటే అన్న క్రిష్ణదేవరాయలు  పద్యం అందుకున్నాడు గదా  “తెలుగదేల యన్న, దేశంబు తెలుగు” అని.

సొంత డబ్బా

మిమ్మల్ని మరీ ఊదరగొట్టడానికి ఇక్కడ బొత్తిగా విషయం బొటాబొటి.  టూకీగా: చిన్న పల్లెటూళ్ళో జననం. సర్కారీ బళ్ళో చదువు. బంగాళాఖాతం ఒడ్డున జీవనం. నూనూగు మీసాల జోష్ లో జ్యోతిశ్శాస్త్ర ఓనమాలు. ముఫ్ఫైఏళ్ళుగా, ఆటుపోటుల్లో, చీకట్లో, వెన్నెల్లో అదే శాస్త్ర మధనం, మననం – నిరంతరం. భాషా బోధన వృత్తి. జ్యోతిష్యం నా చేతన, ప్రవృత్తి, ఊపిరి.  విధి విధానాలు, వివేకం ఆలంబన. వైదుష్యం ఆశ.  అరవైని అందుకోడానికి పరిగెడుతున్న వయసు.
అయినా “దరి మాలిన తృష్ణ యొకటె తరుణత పొందెన్”. ఉండనా మరి!