ఎడ్వర్డ్ స్నోడెన్ అమెరికా లో పుట్టి పెరిగిన ఆ దేశ పౌరుడు. అమెరికా గూఢచారి సంస్థ CIA కి, డెల్ కంప్యూటర్ కి, ఆఖరుగా
NSA (నేషనల్ సెక్యూరిటి ఏజెన్సీ) కి పనిచేసాడు. 2013 మే నెల 20 వ తేదీన, రహస్యాలన్నీ పుక్కిట పట్టి, అమెరికాలోని
హవాయి దీవుల్లో బయలు దేరి హాంగ్ కాంగ్ చేరుకున్నాడు. అక్కడకు చేరుకున్నాక, అమెరికా గూఢచార కార్యకలాపాలకు
సంబంధంచిన వేలకొద్దీ సమాచార పత్రాలను, ది గార్డియన్, ది వాషింగ్టన్ పోస్ట్ పత్రికల ద్వారా ప్రపంచానికి లీక్
చేసాడు. హాంగ్ కాంగ్ నుంచి రష్యా పారిపోయి తలదాచుకున్నాడు.

సున్నితమయిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ద్వారా వ్యక్తిగత ప్రయివసీని తద్వారా పౌర స్వేఛ్ఛను కాల
రాస్తున్న ప్రభుత్వ అనైతిక చర్యలు ప్రజలకు, బాహ్యప్రపంచానికి తెలియ చెప్పాలన్న ఉన్నత మనోధర్మాన్ని
పాటించానంటాడు స్నోడెన్. దేశ భద్రతకి తీరని ముప్పు తెచ్చాడు, టెరరిస్టులకి ఇంటిగుట్టు రట్టు చేసాడు, దేశద్రోహి,
దొంగా అంటూ ఆక్రోశిస్తోంది అమెరికా!

ప్రపంచం తుళ్ళిపడింది! వ్యక్తి ప్రయివసీ చర్చనీయాంశం అయింది. అమెరికా కచ్చలో కందులు వేపిన ఈ డింభకుడి
జాతకం ఏమై ఉంటుందా అన్న ఆలోచన పది రకాలుగా పరిగెడుతున్నాది!
జాతకం చూద్దాం

snowden-chakra

జూన్ 21, 1983 తెల్లవారు ఝామున 4 గంటల 42 నిమిషాలకి స్నోడెన్ శుభ జననం. ఎలిజబెత్ సిటీ, నార్త్ కెరొలీనా లో.
జ్యేష్ఠ మాసం, శుక్ల ద్వాదశి సోమవారం. స్వాతి నక్షత్రం నాలుగవ పాదం, తులా రాశి, వృషభ లగ్నం.

ఈ జాతకం చూస్తే మొదటిగా అనిపించిన విషయం, ఇతనో అసాధారణమైన మనిషి అని. బోలెడు తెలివితేటలు,
అంతకు తగ్గని ధైర్యం సాహసం ఉన్నాయని. జాతకం విశేషాలు చూద్దాం.

స్థూలంగా గ్రహకట్టు
వృషభ లగ్నాధిపతి శుక్రుడు మూడవ స్థానాధిపతి చంద్రుడు పరివర్తన యోగం. చంద్రుని రాశి కర్కాటకంలో శుక్రుడు,
శుక్రుని రాశి తులలో చంద్రుడు.
ఆరవ ఇల్లు తులలో శని ఉఛ్చ మరియు శని వక్రం. నవమ దశమ స్థానాల అధిపతిగా తాత్కాలిక శుభ గ్రహం.

లగ్నంలో బుధుడు వీనికి ఎదురుగా గురుడు (గురుడు వక్రి). రెండూ నైసర్గిక శుభ గ్రహాలు. పాప గ్రహ సంబంధం లేదు.
సహజ కారకత్వాల బట్టి ఈ రెండు గ్రహాలు విద్యకి వివేకానికి, ప్రతిభావ్యత్పత్తులకి, ప్రఙ్ఞాపాటవాలకి సహకరించేవి.

అందులో బుధుడ్ని కాస్త ఆకతాయితనానికి, అవసరమైన అబద్ధాలకి, ఛమక్కులకి కారణమనుకున్నా, అనుకోవచ్చు.
కాని గురుడు మాత్రం దేశ కాల న్యాయాన్ని దాటి ధర్మం గురించి, మానవత్వం గురించి ఆలోచన కలిగించేవాడు. అదే చేశనంటాడు
స్నోడెన్. లేదు ఫలానా చట్టం ప్రకారం దేశద్రోహం నేరం చేసావంటుంది అమెరికా.

చిన్నతనం షరా మామూలే
తల్లి ఎలిజబెత్, మేరీలేండ్ డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగి. తండ్రి లోనీ అమెరికా కోస్ట్ గార్డ్ ఆఫీసరు. అక్క అటార్నీ. అతని తండ్రి
మాటల్లో చెప్పాలంటే ఎడ్వర్డ్ చిన్నతనం నుంచే బాగా చురుకైనవాడు, తెలివైన వాడు. IQ టెస్టులో 145 స్కోరు చేసినవాడు.
లోతైన ఆలోచన సున్నితమైన మనస్తత్వం కనబరిచే వాడు. కుటుంబం తీరుని బట్టి చదువు పూర్తి చేసుకొని ప్రభుత్వోద్యోగం
లో చేరతాడని సహజంగా అలోచన. తండ్రితో బాటు ఊరు మారడంతో చదువు స్కూలు స్థాయిలో ఒడుదిడికుల్లో పడింది.
తరువాత లివర్పూల్ యూనివర్సిటీ ఆన్ లైన్ చదువు కొనసాగింది. జపనీస్ భాష నేర్చుకున్నాడు, తోడుగా మాండరీన్ చైనీస్
భాష కూడా కొంత కృషి చేసాడు. తాను బౌద్ధ మతం అవలంబిస్తానని కూడా ఒక ఫార్మ్ లో మతం అనే కోలం లో నింపాడు.

దశ – అంతర్దశలు – గోచారం
ఎడ్వర్డ్ స్నోడెన్ జాతక ప్రకారం అతడు లేపిన ఈ ప్రస్తుత దుమారాన్ని పరికించి చూద్దాం. ఇతని జాతక ప్రకారం
సెప్టెంబరు 1999 నుండి సెప్టెంబరు 2018 మధ్యను 19 ఏళ్ళపాటు శని మహాదశ జరుగుతున్నాది. అందులో 12-05-2013
నుంచి 18-03-2016 మధ్యను రాహు అంతర్దశ జరిగింది. ఇదే సరిగ్గా ఈ తుఫాను సమయం.

గోచారం ప్రకారం ఈ సమయానికే 4-8-2012 ఋజు శని తులా రాశి లోకి ప్రవేశించాడు. అంటే ఏలిననాటి శని లో తీవ్రంగా
ప్రభావం ఉండే జన్మ శని కాలం ప్రారంభం అయింది. ఈ కాలం లోనే స్నోడెన్ తన ఆలోచనల్ని ఆచరణ లోనికి తెస్తూ
సమాచార ఫైల్స్ డౌన్ లోడ్ చేసుకొని 2013 లో తన జన్మ దినానికి కొద్ది ముందరగా మే 20 వ తేదీన హాంగ్ కాంగ్ కి వెళ్లాడు.
అక్కడకు చేరుకున్నాక లీక్ ల ద్వారా అమెరికా గుట్టు రట్టు చేసాడు. ఆ తరువాత రష్యా చేరుకొని ప్రవాస జీవితం
ప్రారంభించాడు.
జన్మ జాతకం లో ఎనిమిదవ ఇల్లు రంధ్ర స్థానం అంటారు. ఎడ్వర్డ్ స్నోడెన్ జాతకం లో ఈ ఎనిమిదవ ఇంట్లో కేతువు
ఉన్నాడు. గూఢచారి వ్యవస్థలో ఉద్యోగంతో ప్రారంభం, ఆ ఉచ్చు లోంచి బయటపడి ప్రవాసం. మళ్ళీ రహస్య జీవితం.

అయితే రాబోయే 2017 జనవరి ఆఖరుకి శని వృశ్చిక రాశి నుంచి తరువాతదైన ధనస్సు రాశి లో ప్రవేశిస్తుంది. అప్పటికి
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగుస్తాయి. స్నోడెన్ జాతకం లో ఏలిననాటి శని ముగుస్తుంది. లగ్నం నుంచి ఎనిమిదవ
ఇంట్లో శని సంచరిస్తూ జూన్ 5, 2017 నాటికి జన్మ కేతువును కలియటం రాహు కుజ గ్రహాలకు సమసప్తకం లోకి రావడం
జరుగుతాయి. అప్పటికి శని మహాదశ లో గురు అంతర్దశ జరుగుతూ ఉంటుంది. ఆపై నెలల్లో జన్మ రవిపై గోచార శని
దృష్టి, శని వక్రచారం మొదలౌతంది. స్నోడెన్ కి ఒబామా పెట్టని క్షమాభిక్ష అప్పడు మాత్రం దొరుకుతుందా? రష్యా లో
తలదాచుకోడం పాము పడగ నీడలో పడుకోడం అవుతుందా?